● తెలంగాణలో బీజేపీకి
ఒక్క అవకాశం ఇచ్చిచూడండి
● పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
పాలమూరు: ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు 7 నుంచి 18 శాతం పెరిగినా.. దేశంలో ధరలు పెరగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించే చర్యలు తీసుకుంటుందని, ఇది ప్రజలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. నగరంలోని శిశుమందిర్ పాఠశాలలో శనివారం మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. గతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలు ప్రపంచ మార్కెట్‌లో తగ్గినప్పటికీ దేశంలో తగ్గించని పరిస్థితి ఉండేదని, ఆ సమయంలో ఆయిల్ బాండ్స్ అనే విధానాన్ని ఉపయోగించారని విమర్శించారు. పెట్రోల్ ధరలను కృత్రిమంగా తగ్గించి, మిగిలిన భారం భవిష్యత్‌లో చెల్లించడానికి బాండ్ల రూపంలో భారం మోపారని, ఆ బాండ్ల విలువ రూ.లక్షల కోట్లకు చేరిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నా సామాన్యులపై ఆ భారం పడకూడదనే గొప్ప సంకల్పంతో పెట్రోల్, డీజిల్ ఎకై ్సజ్ సుంకాన్ని ఏకంగా రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. సోషల్ మీడియాలో పెట్రోల్ కొరత, గ్యాస్ అందుబాటులో లేదనే తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసర భయాన్ని సృష్టిస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఆశించిన ఫలితాలు రాలేదని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. బీజేపీ కోట్లాది సభ్యులతో మందుకు సాగుతుందని తెలంగాణలో కూడా పార్టీ బలంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, బాలరాజు, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.


