పాలమూరు లోక్‌ అదాలత్‌లో 17,737 కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

పాలమూరు లోక్‌ అదాలత్‌లో 17,737 కేసుల పరిష్కారం

Mar 29 2026 8:48 AM | Updated on Mar 29 2026 8:48 AM

పాలమూరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 17,737 కేసులు పరిష్కరించారు. జిల్లా ప్రధాన కోర్టులలో ఐదు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీల ద్వారా లోక్‌ అదాలత్‌లో మొత్తం ఈ మేరకు కేసులను పరిష్కరించి.. ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి రూ.26 లక్షలకు రాజీ కుదరడంతో సదరు చెక్కును బాధితులకు అందించారు. మరో కేసులో రూ.3 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కోసం జిల్లాలో 2,033 కేసులు గుర్తించి సదరు కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు పి.శ్యాంకోశీ, ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌లకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవం వందనం సమర్పించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా ఓ కేసులో నష్టపరిహారం చెక్కును హైకోర్టు న్యాయమూర్తులు అందజేశారు. అదేవిధంగా విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వచ్చిన జంటకు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కౌన్సెలింగ్‌ ఇచ్చి కలిసి ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ జంట లోక్‌ అదాలత్‌లో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట పూలదండలు మార్చుకొని మళ్లీ ఒక్కటయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనందరావు, జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement