మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య లక్ష్మీవిలాసం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి.. పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్వామి దంపతులను నూతన వస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరించి.. స్వామివారికి స్వర్ణకిరీట ధారణ నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయం చెందారు. పట్టాభిషేకం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకొచ్చి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, అళహరి రామకృష్ణ, రాయల్ కుమార్‌తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


