● నేడు జాతీయ లోక్ అదాలత్ ● జిల్లాలో ఆరు బెంచీల ఏర్పాటు
● హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు
పాలమూరు: రాజీపడదగిన కేసుల పరిష్కారం కోసం శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా కోర్టులో నాలుగు బెంచీలతో పాటు జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించనున్నారు. జిల్లాలో ఇప్పటికే కోర్టు ద్వారా 1,400, పోలీస్ శాఖ ద్వారా 2,600 కేసులకు సంబంధించి ఆయా కక్షిదారులకు నోటీసులు పంపించారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్ హాజరుకానున్నారు.
● ప్రజలకు ఎవరికై నా సమస్య ఏర్పడితే మండల, జిల్లాస్థాయిలో ఉన్న న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించి వారి సమస్యను చెప్పుకోవచ్చు. ఏదైనా తగాదా ఏర్పడితే న్యాయస్థానంలో దావావేసే కంటే ముందు నేరుగా న్యాయసేవా అధికార సంస్థను ఆశ్రయిస్తే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాల సమస్యను పరిష్కరించి వెంటనే తీర్చు చెబుతారు. ఇవే కాకుండా న్యాయస్థానాల్లో దాఖలైన కేసులను కూడా లోక్ అదాలత్ పరిష్కరించుకోవచ్చు. ఎవరైనా లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలంటే సంబంధిత న్యాయమూర్తికి విషయాన్ని తెలిపిన ఇలాంటి కేసులను న్యాయసేవా సంస్థకు పంపిస్తారు. దీంతో ఇరువర్గాల సమక్షంలో రాజీ పద్ధతిలో సత్వరం పరిష్కరిస్తారు. కుటుంబకలహాలు, మనోవర్తి, గృహహింస, అన్ని రకాల సివిల్ దావాలు, నష్టపరిహారం కోరుతూ మోటారు వాహనాల చట్టం కింద నమోదయ్యే కేసులు, బ్యాంకు రుణాలు, భూ తగదాలు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది.
ఇలాంటి కేసుల్లో రాజీ లేదు
హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, బాలికపై లైంగిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, ప్రత్యేక చట్టాలపై నమోదైన కేసులను, క్రూరమైన కేసును లోక్ అదాలత్‌లో రాజీకి వీల్లేదు.


