● డీసీసీబీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా
● చిన్నకారు రైతులు, చిరు
వ్యాపారులకు రుణాలు అందించాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులను కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. బుధవారం డీసీసీబీ సర్వసభ్య సమావేశాన్ని మహబూబ్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఇన్‌చార్జీ సీఈఓ రవికాంత్‌రెడ్డి గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లావాదేవీలు, రుణాల పంపిణీ, డిపాజిట్లు, రికవరీలు, డిఫాల్టర్ల వివరాలను సభ్యులకు వివరించారు. అనంతరం కలెక్టర్, బ్యాంక్ పర్సన్ ఇన్‌చార్జీ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ.. మార్చి 25 నాటికి బ్యాంకు యొక్క డిపాజిట్లు దాదాపుగా రూ.489 కోట్లకు చేరుకున్నాయని, నేటి వరకు బ్యాంకు ద్వారా రూ.753 కోట్ల స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,393 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ, వ్యవసాయేతర రుణాల అందించామన్నారు. అదేవిధంగా రుణ వసూళ్లలోనూ ప్రగతిని కనబరుస్తూ నిరర్థక ఆస్తులను 2.86 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆర్‌బీఐ అనుమతితో త్వరలోనే బ్యాంకు వినియోగదారులందరికీ యూపీఐ సేవలు, 14 నూతన బ్రాంచ్ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. 31 మార్చి, 2026 నాటికి రూ.2,500 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా 23 మార్చి, 2026 నాటికి రూ.2,400 కోట్ల టర్నోవర్ సాధించినట్లు వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాలకు..
మహిళా స్వయం సహాయక సంఘాలు, పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న వారికి కూడా రుణాలు విస్తరించాలని, వీరు మంచి రీపేమెంట్ సామర్థ్యం కలిగిన వర్గమని పేర్కొన్నారు. అలాగే డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని వర్గాలకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల రికవరీ, వడ్డీ చెల్లింపుల సమస్యలు ఉన్నచోట అధికారులు స్వయంగా గ్రామాలకు వెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. డీసీసీబీకి ఎన్నికై న పాలక మండలి లేకపోవడంతో నియమించబడ్డ సభ్యులు, అధికారులు ఆర్బీఐ, నాబార్డ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో బ్యాంకు సీఈఓ రవికాంత్‌రెడ్డి, డీజీఎం బాలు, నాబార్డ్ డీడీఎం షణ్ముఖచారి, డీసీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


