మహబూబ్‌నగర్ క్రైం/వనపర్తి: వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, క్వారీలు, కాల్వలు, డ్యాంల్లో ఈత పడేందుకు వెళ్తున్న చిన్నారులు, యువకులు, విద్యార్థులు అజాగ్రత్తగా ఉంటూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ముగియడంతో పాటు పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు కొనసాగుతున్న తరుణంలో విద్యార్థులు ఈత పడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈత రాకుండా నీటి కుంటల్లోకి దిగడం, ఇతరత్రా కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
చిన్నారులతో అప్రమత్తం
చిన్నారులకు ఈత నేర్పేందుకు బావుల వద్దకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం వారు నిర్లక్ష్యంగా ఉండి, చిన్నారులను గమనించకుండా ఉన్నా.. బావుల్లో ఈత పడే వారిని చూస్తూ అమాయకంగా పిల్లలు అందులో దూకే ప్రమాదం ఉంటుందన్నారు. చిన్నారులకు ఈత నేర్పించే సమయంలో మొదట వాళ్లు అలవాటు పడే వరకు తల్లిదండ్రులు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్నిసార్లు పిల్లలకు ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను కట్టి ఈత పడేందుకు పంపిస్తారని, అలా చేయకూడదన్నారు. అనుకోని పరిస్థితుల్లో వాటిలోకి నీరు వెళితే చిన్నారులు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బావుల్లో కంప చెట్లు, రాళ్లు ఉండడంతో వాటిలో చిక్కుకొని మరికొందురు మృత్యువాత పడుతున్నారని, ఈతకు వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తించాలి.
ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లాలో అధికమవుతున్న ప్రమాదాలు
క్వారీలు, గుంతల్లో ఈతకు వెళ్లి పలువురు మృత్యువాత
అవగాహన కల్పిస్తున్న అధికారులు,పోలీసులు
తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి
జాగ్రత్తలు
పిల్లలు సాహసం చేస్తున్నామనే భ్రమలో లోతు తెలుసుకోకుండా నీటిలో దూకుతుంటారు. ఇలాంటివి చేయకుండా ఉండాలనే విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలి.
ఫిట్స్, గుండె జబ్బులున్న పిల్లలను ఈతకు వెళ్లనీయకూడదు. ప్రమాదకరమైన నదులు, చెరువులు, కాల్వల్లో పిల్లలు దిగకుండా అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు అమర్చాలి.
పిల్లలు సెలవుల్లో ఎక్కడికెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అనేది తల్లిదండ్రులు తప్పక గమనించాలి.
చెరువులు, కాల్వలు, బావుల వైపు ఒంటరిగా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది
నీటి ప్రవాహాలు, గతంలో జరిగిన ప్రమాదాల గురించి పిల్లలకు వివరించాలి. నీళ్లు అంటే పిల్లలు భయపడేలా కాకుండా బాధ్యతాయుతంగా మెలిగేలా చేయాలి.
నీటిలో ఆడుకోవడానికి, ఈత కొట్టడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రదేశాల్లో ఈతకొట్టే సాహసం చేయరాదు.
ఈత నేర్చుకునేటప్పుడు లైఫ్ జాకెట్లు, ఫ్లోటింగ్ ట్యూబ్‌ల వంటి సురక్షిత సామగ్రిని వినియోగించాలి.
దరికి దూరంగా ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో అలసిపోవడం, అక్కడి నుంచి వెనుకకు వద్దామన్న రాలేక.. ఊపిరాడక నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.
నీటిలో అడుగుభాగాలకు వెళ్లి మట్టిని తేవడం, ఎవరు ఎంత సేపు నీటిలో మునిగి ఉంటారనే పోటీలు ఇతర ఆటలు ఆడరాదు.
నీటిలో మునిగిన వ్యక్తిని, కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసేవారు సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి.


