● అంతర్మథనంలో సిబ్బంది
● అనుమానిత వ్యక్తులపై నిఘా
గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డ్రెస్సింగ్ గదిలో వృద్ధురాలి బ్యాగులోని నగదు, బంగారు ఆభరణాల మాయంపై జిల్లా పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. 16 రోజుల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన ఓ వృద్ధురాలు రూ.14 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు మాయం అయిన సంఘటన విదితమే. ఈ వ్యవహారంలో ఎంతమంది పాత్ర ఉందనే విషయంపై విచారణ బృందం ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు వచ్చిన సమయంలో ఒంటరిగా వచ్చారా లేక మరొకరి సహాయంతో అక్కడికి వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు అపహరణకు గురయ్యాయని వృద్ధురాలు, కుమారుడి ఫిర్యాదుపై పోలీసులు కూపీలాగుతున్నారు. మక్తల్ నుంచి గద్వాలకు రావడం గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఓ సిబ్బంది వ్యవహరించిన తీరును సీసీ ఫుటేజీలో పరిశీలించగా అటువైపు ఆ సిబ్బంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. వృద్ధురాలు నిద్రలోకి జారుకున్న క్రమంలో ఓ మహిళ సిబ్బందితో బ్యాగును తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సదరు మహిళను విచారణ బృందం ఆస్పత్రి అధికారుల సమక్షంలో వాకబు చేశారని, సోమవారం సైతం ఇద్దరు వ్యక్తులను విచారించినట్లు సమాచారం. అయితే పోలీసు విచారణలో ఉన్న సిబ్బంది గతంలోను మృతి చెందిన మహిళ ముక్కుపుడక, కమ్మలను అపహరించినట్లు ఆస్పతి సిబ్బంది తెలుపుతున్నారు. ఈ రెండు ఆరోపణలపై సదరు సిబ్బంది సైతం పెదవిరుస్తున్నారు.
అంతర్మథనంలో..
ఆస్పత్రిలోనే నగదు, ఆభరణాలు మాయం అయినట్లు తెలియడం, పోలీసులు విచారణ చేపడ్తున్న క్రమంలో సిబ్బంది అంతర్మథనంలో పడ్డారు. ఆస్పత్రిలో విలువైన మందులు, శస్త్ర చికిత్స పరికరాలు తదితర వాటికి రక్షణ ఉంటుందనే విషయంపై మల్లగులాలు పడుతున్నారు.


