కందనూలు: సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్‌ఓ రేవంత్ చంద్ర, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాలన్నారు. ఈ జాతరకు మూడు రోజులపాటు పరహాబాద్ నుంచి లోపలికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీస్‌శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాత్రి వేళల్లో నడిచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మధ్యమధ్యలో సోలార్ లైట్లును ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం విరివిగా బస్సులను ఏర్పాట్లు చేయాలని నాగర్‌కర్నూల్ డీఎంను ఆదేశించారు. వైద్యశాఖ తరఫున పలుచోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యసిబ్బంది, అంబులెన్స్‌లను 24గంటలు పర్యవేక్షణ జరిపేలా ఏర్పాటు చేయాలని, కింద గుండం వద్ద వైద్యసిబ్బంది అన్నిరకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా, వాహనాల అనుమతి తదితర అంశాలను పోలీస్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సలేశ్వరం జాతరకు గర్భిణులు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు రాకుంటే మంచిదని తెలిపారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అధికారులు కమిటీ సభ్యులు చెంచు సంఘాల నాయకులు పోలీస్‌శాఖకు సహకారాలు అందించాలని, సలేశ్వరం జాతరను అత్యంత పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.


