2,700 ఇళ్లు మంజూరు..
●
అసంపూర్తి దశలో వందలాది డబుల్ బెడ్‌రూం ఇళ్లు
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంటలో బహుళ
అంతస్థుల విధానంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే కొన్నాళ్ల తర్వాత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. ఇప్పటి వరకు మళ్లీ మొదలు పెట్టలేదు. ఈ కోవలోనే బోయలకుంటకు చెందిన మోటం అంజమ్మ తనకు డబుల్
బెడ్ రూం ఇల్లు ఎప్పుడు దక్కుతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తుంది. కవర్లతో కప్పిన గుడిసె లాంటి ఇంట్లో ఎండకు
ఎండుతూ.. వానకు తడుస్తూ.. కాలం వెళ్లదీస్తుంది.
జడ్చర్ల: జిల్లాలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడికక్కడ వృథాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. రూ. కోట్లు వెచ్చించి.. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కొన్నిచోట్ల అసంపూర్తిగా, మరికొన్నిచోట్ల నిర్మా ణాలు పూర్తయినా కేటాయించకపోవడంతో అటు ప్రభుత్వ లక్ష్యం.. ఇటు నిరుపేదల సొంతింటి కల నెరవేరడం లేదు. కనీస మౌలిక సదుపాయాల కల్పనతో అర్హులందరికీ డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు తమకు సొంతిళ్లు దక్కుతాయనుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, రాజకీయ విభే దాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది డబుల్ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారం.
నిలిచిన నిర్మాణాలు
బహుళ అంతస్థుల విధానంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లడ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా ఇళ్లను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. బాదేపల్లి రంగనాయకస్వామి గుట్ట ప్రాంతంలో నిర్మించిన 48 డబుల్ బెడ్‌రూం ఇళ్లు అసంపూర్తి దశలోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే ఆలూరు రోడ్డులోని ఫకీర్‌నగర్‌లో నిర్మించిన 24 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. బోయలకుంటలో నిర్మించిన 96 ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి.
నోటీసులు జారీ..
ఎర్రగుట్ట ప్రాంతంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాల్సిన ఇళ్లను అక్రమంగా ఆక్రమించారని, ఒకవేళ ఆయా ఇళ్లను ప్రభుత్వం కేటాయించి ఉంటే అందుకు ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలు తమకు మూడు రోజుల గడువులో సమర్పించాలని నోటీసులలో పేర్కొన్నారు. అలా చేయకపోతే అక్రమంగా నివాసం ఉంటున్నట్లు భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్మాణాలు పూర్తయిన చోటా
కేటాయించని వైనం
ఎర్రగుట్టలో యథేచ్ఛగా
సాగుతున్న ఆక్రమణలు
నోటీసులు జారీచేసి చేతులు
దులుపుకొంటున్న అధికారులు
లబ్ధిదారుల ఎంపికలో తాత్సారం.. ఆందోళనలో నిరుపేదలు
జడ్చర్ల నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో దశల వారిగా 2,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఎక్కువగా జడ్చర్ల మండలంలోనే 2,132 ఇళ్లు నిర్మించారు. అయితే కావేరమ్మపేట, బాదేపల్లి, బండమీదిపల్లి, కోడ్గల్ వంటి గ్రామాలు మినహాయిస్తే ఎక్కడా డబుల్‌బెడ్ రూం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదు. మిడ్జిల్, బాలానగర్, నవాబుపేట, రాజాపూర్ మండలాల్లో సైతం డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరుకు సంబంధించి ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 3 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం.


