జడ్చర్ల టౌన్: స్పెషల్ ఇన్‌సెంటివ్ రివిజన్ (సర్)కు ఈ నెల 31 వరకు బూత్‌లెవల్ ఏజెంట్లను నియమించి రాజకీయ పార్టీలు సహకరించాలని ఈఆర్‌ఓ, అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. మంగళవారం జడ్చర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా రివిజన్ కొనసాగుతుందని, అందుకు ఇప్పటికే మ్యాపింగ్ జరుగుతుందని వివరించారు. మ్యాపింగ్ ప్రకారం బీఎల్‌ఓలు ఇంటింటికి తిరుగుతారన్నారు. సర్ ద్వారా డబుల్ ఓట్లు ఉంటే తొలగిస్తామని, ఓటరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉంచుతామన్నారు.
మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలి
సర్ మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలని బీఎల్‌ఓలకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచించారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఎల్‌ఓ శిక్షణలో ఆమె పాల్గొని సూచనలు చేశారు. సర్‌లో భాగంగా ఇంటింటికి తిరిగి పరిశీలించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా శిక్షణ దోహదపడుతుందని, రాజకీయ పార్టీల ఏజెంట్లు సైతం సహకరిస్తారని చెప్పారు.
నగరంలో లోతట్టు ప్రాంతాల పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌలి, గణేష్‌నగర్, ఎర్రకుంట పరిసరాలు, రాయచూర్ రోడ్ తదితర ఏరియాలను మంగళవారం ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పరిశీలించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డిని ఆదేశించారు. అలాగే ఆయాచోట్ల కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు.
అప్పన్నపల్లిలో మేయర్ పరిశీలన
డివిజన్ నం.3 పరిధిలోని అప్పన్నపల్లిలో నగర మేయర్ మమత పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వీధుల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీటిని వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, లక్ష్మయ్య, టీపీబీఓ అభిలాష్, ఏఈ రాగవి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ ప్రధాన పథకాల అమలుపై వెబెక్స్ ద్వారా ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.


