జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బా ధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ జానకితో కలిసి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. 2019 నుంచి 2026 వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదైన కేసులు, బాధితులకు పరిహారం చెల్లింపు, పెండింగ్ కేసులపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు 380 కేసుల్లో 224 కేసులకు గాను రూ.38,33,07,500 బాధితులకు పరిహారం అందించామని, 156 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వరం స్పందించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


