భర్త బతికున్నా.. వితంతు పింఛన్
గద్వాల క్రైం: భర్త ఏ కారణం చేతనైనా మృతిచెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు భార్యకు ప్రభుత్వం వితంతు పింఛన్ అందజేస్తుంది. కానీ, భర్త బతికుండగానే ఓ మహిళ ఏకంగా 11 ఏళ్లుగా వితంతు పింఛన్ పొందుతుంది. పైపెచ్చు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందింది. అయితే వార్డు సభ్యులు ఇటీవల పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ నెల 20న పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో వెలుగు చూసింది. వివరాలిలా..
జోగుళాంబ గద్వాల పట్టణంలోని 36 వార్డుకు చెందిన సునీత తన భర్త కమ్మరి రాముడు మృతి చెందాడని 2015లో గద్వాల మున్సిపాలిటీలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో అదే ఏడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం సదరు మహిళకు వితంతు పింఛన్‌ను మంజూరు చేసింది. 2015 జూన్ నుంచి 2025 డిసెంబర్ వరకు (సుమారు 125 నెలలు) ఆమె వితంతు పింఛన్ పొందుతుంది. తాజాగా ఇదే ఆమె మున్సిపల్ ఎన్నికల్లో 36వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందడం విశేషం.
అయోమయం..
కమ్మరి రాముడు మరణించినట్లు భార్య సునీత వితంతు పింఛన్ పొందుతున్నట్లు బహిర్గతం కావడంతో సదరు మహిళ అయోమయంలో పడ్డారు. 2015లో అప్పటి కౌన్సిలర్ తనకు బీడీ కార్మి కురాలుగా పింఛన్ ఇప్పిస్తానని చెప్పి.. ఆధార్ కార్డు, బ్యాంకు పాసు బుక్, ఫొటో తీసుకుని పింఛన్ వచ్చేలా చేశాడని సునీత చెబుతున్నారు. ఇంతవరకు అది బీడీ కార్మికురాలికి అందించే పెన్షనే అనుకున్నానని, వితంతు పింఛన్ అని తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే వితంతు పెన్షన్‌ను తానే తిరస్కరిస్తూ జనవరి 3, 2026న పింఛన్ రద్దు చేయాలని అధికారులకు దరఖాస్తు చేశానని ‘సాక్షి’తో వెల్లడించారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని ప్రయత్నించినా.. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 36వ వార్డు కౌన్సిలర్ గెలవడంతో భరించలేని కొందరు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
వేటు తప్పదా..
వితంతు పింఛన్ వ్యవహారం జిల్లాకేంద్రంలో హాట్‌టాఫిక్‌గా మారింది. తప్పుడు ధ్రువపత్రాలతో 11 ఏళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి పింఛన్ పొందిన సునీతను కౌన్సిలర్‌గా బర్తరఫ్ చేస్తారా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ విషయంపై గద్వాల మున్సిపల్ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
బయటపడింది ఇలా..
గద్వాల రాజకీయం ఎప్పటికై నా రసవత్తంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే భర్త బతికుండగానే 11 ఏళ్లుగా ఓ మహిళ వితంతు పింఛన్ పొందడం, కౌన్సిలర్‌గా గెలుపొందడం హాట్‌టాపిక్‌గా మారింది. 36వ వార్డులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆ వార్డు మహిళకు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి మున్సిపల్ చైర్మన్‌గా ప్రకటన చేశారు. దీంతో ప్రధాన ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రచార సమయంలోనే వితంతు పింఛన్ వ్యవహారం బయటకు తీసుకువచ్చారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
విచారణ చేస్తున్నాం..
36వ వార్డు కౌన్సిలర్ సునీత తన భర్త రాముడు మృతి చెందినట్లు ప్రభుత్వం నుంచి వితంతు పింఛన్ పొందుతున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులెవరైనా శిక్ష అనుభవించక తప్పదు. మున్సిపల్ అధికారులను సైతం విచారిస్తాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
– శ్రీను, సీఐ గద్వాల
గద్వాల మున్సిపాలిటీలో
ఓ మహిళ నిర్వాకం
11 ఏళ్లుగా సాగిన తతంగం
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో
కౌన్సిలర్‌గా గెలుపుతో వెలుగులోకి..
స్థానికుల ఫిర్యాదుతో
చీటింగ్ కేసు నమోదు


