వేర్వేరు ఘటనలో ముగ్గురి మృతి
నవాబుపేట: మండలంలో వివిధ గ్రామాల్లో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. ఒకరు ప్రేమలో విఫలమై ఆత్యహత్యకు పాల్పడగా.. మరో మహిళ ప్రమాదవ శాత్తు చీరకు నిప్పంటుకుని మృతిచెందగా.. మరోవ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా..
ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది..
ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది, విద్య సరిగ్గా అభ్యసించకుండా తీవ్ర మనోవేదన చెందిన విద్యార్థి మనస్తాపంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని చాకలపల్లికి చెందిన పురుషోత్తం(17) మండలంలోని యన్మన్‌గండ్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ విషయంలో తీవ్ర మనోవేదన చెంది క్షణికావేశంతో ఈనెల 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సోమవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి సోదరుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
చీరకు నిప్పంటుకుని మహిళ మృతి
వంట చేస్తూ ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని మహిళ మృతిచెందింది. మండలంలోని కాకర్‌జాల్‌కు చెందిన గోవు పద్మమ్మ(65) సోమవారం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకుంది. దీంతో మంటలు తీవ్రం కావడంతో ఆమె అరుపులతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే చాలా మంటలు రావడంతో దుస్తులు కాలిపోయాయి. వెంటనే 108వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు జంగయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బైకుపై వెళ్తుండగా.. చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని కారుకొండలో చోటుచేసుకుంది. కారుకొండకు చెందిన మహేశ్ సోమవారం రాత్రి గ్రామసమీపంలో ఖానాపూర్ రోడ్డులోని చెరువు కట్టపై ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గ్రామస్తులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరి అనిత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
వేర్వేరు ఘటనలో ముగ్గురి మృతి
వేర్వేరు ఘటనలో ముగ్గురి మృతి


