‘జూరాల’.. తగ్గుముఖం
అమరచింత: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.262 టీఎంసీలు మాత్రమే ఉండటంతో వేసవిలో తాగునీటి పథకాలకు సరిపడా నీటిని అందించలేని పరిస్థితి ఎదురుగాక తప్పదని అనిపిస్తోంది. ప్రాజెక్టు నిల్వనీటి సామర్థ్యం 11 టీఎంసీలు కాగా.. 9 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసి ఏటా వానాకాలంతో పాటు యాసంగిలో సైతం ఆయకట్టుకు సాగునీటిని వదులుతారు. ఈ ఏడాది కూడా వానాకాలంలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించిన ప్రభుత్వం.. యాసంగిలో మాత్రం ఎడమ, కుడి కాల్వ పరిధిలో కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని వారబందీ విధానంలో అందిస్తూ మిగిలిన వాటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.
● జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. యాసంగిలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. దిగువ ఆయకట్టు రైతులు తమకు సాగునీరు ఇవ్వాలని కోరినా.. వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా సరఫరా చేయలేమంటూ చెప్పుకొచ్చారు.
సాగునీటికి 600 క్యూసెక్కులు..
యాసంగిలో వారబందీ విధానంలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు రోజుకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 3.262 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీనికి తోడు ప్రాజెక్టు గేట్ల లీకేజీలు, ఆవిరి రూపంలో రోజు 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. అలాగే జలాశయంలో రెండు టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది.
● జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి సత్యసాయి తాగునీటి పథకంతో పాటు రామన్‌పాడు, బుగ్గపల్లి, గోపాల్‌పేట తాగునీటి పథకాలతో 250కి పైగా గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీరు అందుతోంది. ఏటా వేసవిలో తాగునీటి అవసరాలకు సరిపడా నీరు ప్రాజెక్టులో లేకపోవడంతో ఎగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీలు సరఫరా చేయించుకొని గట్టెక్కుతున్నారు.
● ఎల్లూరు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని దాదాపు మండలాలకు తాగునీరు అందుతున్నందున వేసవిలో వనపర్తి జిల్లా ఆత్మకూర్, అమరచింత మండలాలకు మాత్రమే తాగునీటి కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు దాపురించాయి. ఈ మండలాలు జూరాలపై ఆధారపడటంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.
జూరాల జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం
రోజురోజుకు పడిపోతున్న నిల్వ నీటిమట్టం
ప్రస్తుతం 3.262 టీఎంసీలు మాత్రమే..
వారబందీ విధానంలో
ఆయకట్టుకు సరఫరా
వేసవికి ముందే తలెత్తనున్న
తాగునీటి కష్టాలు!
‘జూరాల’.. తగ్గుముఖం


