కమనీయం ఆదిదంపతుల కల్యాణం
● నంది వాహనంపై ఊరేగింపు
● అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
అలంపూర్: మహా శివరాత్రి బ్రహోత్సవాల్లో భాగంగా అలంపూర్ క్షేత్రంలో వెలిసిన బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి కల్యాణ మహోత్సవం సోమవారం తెల్లవారు జామున అత్యంత వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీసేవలో తుంగభద్ర పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. ఆలయ ఈఓ దీప్తి కల్యాణవస్త్రాలను అర్చక స్వాములకు అందజేశారు. వేదమంత్రాల మధ్య ఆదిదంతపతుల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద పండితులు శివరాత్రి విశిష్టత, లింగోద్భవ ప్రాముఖ్యత, పూజల అవశ్యకతను భక్తులకు వివరించారు. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి దీక్ష విరమించారు.
నంది వాహనంపై ఊరేగింపు..
కల్యాణ మహోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను నంది వాహనంపై కొలువుదీర్చి పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అదే విధంగా సాయంత్రం హంస వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగున స్వాగతం పలుకుతు మొక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా రథోత్సవం
మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆది దంపతులు కొలువుదీరిన రథాన్ని హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు ముందుకు కదలించారు. విద్యుత్ దీపాల అలంకరణలో రథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మున్సిపల్ చైర్మన్ జయరాముడు, ప్రముఖలు కొబ్బరికాయలు సమర్పించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
మహా శివరాత్రి జాగరణకు విచ్చేసిన భక్తులతో అలంపూర్ క్షేత్ర ఆలయాలు జనసందోహంగా మారాయి. ఈ సందర్భంగా భక్తుల కోసం అధికారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భజనలు, సంకీర్తన లు, వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నందికోళ్ల సేవ, పౌరాణిక నాటకం, జానపద నాటికలు, పాటలు, కూచిపూడి, భరతనాట్యం, హరికథలు వంటి విశేష కార్యక్రమాలు జరిగాయి.
కమనీయం ఆదిదంపతుల కల్యాణం
కమనీయం ఆదిదంపతుల కల్యాణం
కమనీయం ఆదిదంపతుల కల్యాణం


