మేయర్ ఎన్నికకు పటిష్ట భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో సోమవారం నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆదివారం ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేషన్ కార్యాలయం లోపల, బయట పోలీస్ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ చర్యలు తీసుకోవాలని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా వరకు రాకపోకలపై తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించించాలని సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అధికంగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవల వాహనాలకు అనుమతి ఇవ్వబడుతుందని, ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. నగర ప్రజలు, అన్ని రకాల వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, ఎస్‌ఐ శీనయ్య పాల్గొన్నారు.


