ఒకే పార్టీ నుంచి ఇద్దరికి బీ–ఫాం ఇస్తే..!
పాలమూరు: కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించనున్న నేపథ్యంలో.. గుర్తింపు పొందిన రిజిస్టర్, ఎన్నికల సంఘం వద్ద ఏదైనా గుర్తుతో నమోదైన పార్టీలు తమ అభ్యర్థులకు బీ–ఫామ్ అందిస్తే ఆయా గుర్తులను వారికి కేటాయించడం ఆనవాయితీ. ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ముగుస్తుంది. ఈ లోపు బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బీ–ఫామ్ అందిస్తే వారికే ఆయా పార్టీ గుర్తు కేటాయిస్తారు. ఒక వార్డు నుంచి బరిలో ఉన్నవారిలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఏదైనా పార్టీ బీ–ఫామ్‌లు అందిస్తే ఏంటి పరిస్థితి? అయితే దీనికి ఒక నిబంధన ఉంది. ముందుగా నామినేషన్ పత్రం ఎవరు దాఖలు చేస్తారో వారికే పార్టీ గుర్తును కేటాయించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. బీ–ఫామ్ ఇచ్చిన మరో వ్యక్తిని అదే పార్టీ అభ్యర్థిగా పరిగణించరు. రిటర్నింగ్ అధికారులు ఆ అభ్యర్థిని స్వతంత్రుడిగా ప్రకటిస్తారు.


