రమణీయం.. రథోత్సవం
● గోవింద నామస్మరణతో దద్దరిల్లిన మన్యంకొండ
● మాఘపౌర్ణమి వెన్నెల్లో లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం
● భక్తిశ్రద్ధలతో గరుడవాహన సేవ, ఎస్పీ ప్రత్యేక పూజలు
మహబూబ్‌నగర్ రూరల్: మాఘ పౌర్ణమి వెన్నెల్లో మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం సోమవారం తెల్లవారుజామున రమణీయంగా సాగింది. భక్తుల గోవింద నామస్మరణ మధ్యసాగిన ఘట్టం ఆధ్యాత్మిక కాంతులను నింపింది. స్వామివారి దివ్యదర్శనార్థం వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, తేరు మైదానం, కోనేరు, ఘాట్‌రోడ్లు, పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తులు గోవిందా.. గోవిందా నామాన్ని స్మరిస్తూ రథాన్ని లాగగా, ప్రతి అడుగులో భక్తి వెల్లివిరిసింది. వెన్నెల వెలుగుల్లో అలంకరించిన తేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల హరినామస్మరణతో మునులకొండలు పులకించిపోయాయి. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. సుమారు లక్షకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని దేవస్థానం అధికారుల అంచనా.
నిండుపౌర్ణమి వెన్నెల్లో..
ఒకపక్క నిండు పౌర్ణమి వెన్నెల.. మరోపక్క ఫ్లడ్‌లైట్ల వెలుతురులో తేరు మైదానం మెరిసిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు తరించారు. రథం ఎదుట కాల్చిన బాణా సంచా హైలైట్‌గా నిలిచింది. ఒకపక్క తారాజువ్వల సందడి మరోపక్క బాణాసంచా పేలుళ్లతో తేరు మైదానం మారుమోగింది. రథోత్సవం అనంతరం స్వామివారిని గరుడవాహనంపై మెట్లమార్గం గుండా గర్భగుడిలోకి తీసుకెళ్లారు.
విస్తృత ఏర్పాట్లు
రథోత్సవం సందర్భంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు, రెవెన్యూ, ఆలయ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టారు. అన్నప్రసాద వితరణ, తాగునీటి సదుపాయాలు ఏర్పాటుతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
మన్యంకొండలో లక్ష్మీ
వేంకటేశ్వరస్వామి రథోత్సవం
గరుడ వాహనంపై
తేరు మైదానానికి..
మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారిని గర్భగుడి నుంచి శోభాయమానంగా అలంకరించిన గరుడవాహనంపై సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య స్వామివారు గరుడవాహనంపై ఊరేగుతూ తేరు మైదానానికి చేరుకున్నారు. బంగారు ఆభరణాలు, కాగడాల వెలుతురలో పూలమాలధారణతో పద్మావతి, లక్ష్మీదేవి సమేత స్వామివారు మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఎస్పీ జానకి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు.


