గద్వాల కాంగ్రెస్‌లో బీ–ఫామ్‌ల పంచాయితీ
గద్వాల: స్థానిక కాంగ్రెస్ పార్టీలో బీ–ఫామ్‌ల లొల్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీచైర్‌పర్సన్ సరితల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. ఇక మిగిలింది బీ–ఫామ్‌లు సమర్పించడమే. అయితే బీ–ఫామ్‌ల పంచాయతీ ఓపట్టాన కొలిక్కి రాకపోవడంతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రి, సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సరితతో మంతనాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సైతం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. గద్వాల మున్సిపాలిటీకి సంబంధించిన బీ–ఫామ్‌లను ఎమ్మెల్యే వర్గానికే ఇవ్వాలని అధిష్టానం మొగ్గుచూపినట్లు సమాచారం. ఇందులో మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకుడు గంజిపేట శంకర్‌కు బీ–ఫామ్ ఇవ్వటానికి సయోధ్య కుదిరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేలా ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అసమ్మతి వర్గం లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.
ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ల మధ్య కుదరని సయోధ్య
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ రాయబారం
సోషల్ మీడియా ఖాతాలపై నిఘా
కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. అభ్యర్థులు తమ ప్రచారానికి వేగంగా సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు, మాటల పేరుతో ఇతరులను రెచ్చగొట్టేలా, మతాలకు తావిచ్చేలా ఎవరూ పోస్టులు, కామెంట్లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లపై ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల వాతావరణం నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చినా, చట్టవిరుద్ధంగా చర్యలు చేపట్టినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రచారంలో భాగంగా ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణకు, నామినేషన్ దాఖలు సమయంలో ర్యాలీలు, సమావేశాలు, వాహనాల వినియోగానికి స్పష్టమైన పోలీసు సిబ్బంది అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లౌడ్ స్పీకర్లు నిబంధనల ప్రకారం మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉంటుందని, దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పేర్కొంటున్నారు.
గద్వాల కాంగ్రెస్‌లో బీ–ఫామ్‌ల పంచాయితీ


