రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి సమీపంలో ఉండవెల్లి శివారులోని ఎత్తు బ్యాంకు వద్ద రైల్వే పట్టాలపై గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఎరుపు చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్, ఒంటి నిండా పచ్చబొట్లు ఉన్నాయని, చాతీపై శివుడి బొమ్మ, ఎడమ వైపు ఫాతీమా, కుడివైపు కాశమ్మ, చేతికి ఎర్ర దారం, అమ్మమ్మ, కాశీ కృష్ణవేణి అనే పేర్లు, మెడ భా గాన త్రిశూలం పచ్చబొట్టు ఉందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు గద్వాల రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ అశోక్ పేర్కొన్నారు.
రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య
రాజాపూర్: బాలానగర్ మండల కేంద్రం సమీపంలో రైలు కింద పడి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని తిరుమలగిరి పంచాయతీ శివారులోని కిచ్యనాయక్ తండాకు చెందిన సంధ్య(15) మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి విద్యనభ్యసిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి వచ్చిన సంధ్యతో కలిసి తల్లిదండ్రులు శ్రీను, సంగీత తదితర కుటుంబ సభ్యులు సోమవారం శంషాబాద్‌లో బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడినుంచి మంగళవారం ఉదయం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బాలానగర్‌లో హోటల్‌లో టిఫిన్ చేసేందుకు ఆగారు. టిఫిన్ చేసిన అనంతరం చేతులు కడిగేందుకు వెళ్లిన సంధ్య అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెకోసం వెతికారు. కాలినడకన బాలానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడినుంచి బాలానగర్–చింతగూడ మార్గం వైపు వెళ్లి రైలు కింద పడి మృతిచెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కూతురు ఎందుకు అఘాయిత్యానికి పాల్పడిందో తెలియదంటూ బోరున విలపించారు. రైల్వేపోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


