పీఎంశ్రీ నిధులను సంపూర్ణంగా వినియోగించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పీఎంశ్రీ ద్వారా పాఠశాలలకు మంజూరైన నిధులను సంపూర్ణంగా వినియోగించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీఎంశ్రీ స్కీమ్ పరిధిలో ఉన్న పాఠశాలలలో యోగా, సైన్స్, గణిత ప్రయోగాలకు కావాల్సిన పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహ పాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణ కోసం మంజూరైన నిధులను సమయానికి, సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కేటాయించిన నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్స్ కాకుండా చూడాలని ఆమె ఆదేశించారు. పీఎంశ్రీ కింద 26 పాఠశాలలకు 20 రకాల గ్రాంట్‌లకు సంబంధించిన బిల్లులు సోమవారం నాటికి ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, పీఏఓ యాదగిరి పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ విజయేందిర


