మెడికల్ సీట్లు పెరిగే అవకాశం?
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్‌లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్‌ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్‌ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్‌ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్‌ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్‌ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, వైద్యులు ఉన్నారు.
150 సీట్లతో 2016లో పాలమూరు ప్రభుత్వ కళాశాల ప్రారంభం
ఇప్పటి వరకు 4 బ్యాచ్‌లు పూర్తి
తాజాగా ఎన్‌ఎంసీ బృందం పర్యటన
ప్రస్తుతం 175 మెడికల్ సీట్లు..200కు పెరిగే అవకాశం


