బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ అర్ధనగ్న నిరసన
అచ్చంపేట రూరల్: మూడేళ్ల క్రితం మన ఊరు– మన బడి పథకానికి ఎంపికై న పాఠశాలలో అదనపు గదులు, మరమ్మతు తదితర పనుల బిల్లులు చెల్లించడం లేదని ఓ కాంట్రాక్టర్ అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులు చేసి అప్పుల పాలయ్యానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. మండలంలోని నడింపల్లికి చెందిన కాంట్రాక్టర్ శేఖర్ 2022– 23 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం హయాంలో మన ఊరు– మనబడి పథకంలో నడింపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో గదుల మరమ్మతుకు రూ.40 లక్షలు మంజూరైతే రూ. 10 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.95 లక్షలు, ఆశ్రమ పాఠశాలలో రూ. 25 లక్షలు, ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో రూ.32 లక్షలు అప్పులు తెచ్చి సుమారు రూ.2 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ఇటీవలే నడింపల్లి పాఠశాల గదులకు తాళం వేసినా ఫలితం లేక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు.


