నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు
సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
నిశిత పరిశీలన..
మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్‌ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్‌శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి పాలమూరులో..
రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్‌కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు.
అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్‌తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి..
ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా?
ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి


