కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజులరెడ్డి ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మెప్మా ఆర్‌పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వచ్చే మార్చి 31లోగా ప్రతి ఆర్‌పీ పది చొప్పున కొత్త గ్రూపులు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఉన్న సుమారు 3,100 సంఘాలతో పాటు కనీసం మరో వేయి కొత్తవి ఉండాలన్నారు. ఇప్పటివరకు కేవలం 120 మాత్రమే ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తామని, ఇంటింటికీ తిరిగి వీలైనన్ని ఎక్కువ సంఘాలలో మహిళలను చేర్పించాలన్నారు. ఇన్‌చార్జి డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో పోటాపోటీ దరఖాస్తులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. ఆయా డివిజన్లకు నియామకమైన కోఆర్డినేటర్లు టికెట్ ఆశిస్తున్న వారినుంచి దరఖాస్తులు తీసుకున్నారు. 60 డివిజన్లకు 293 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆయా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సర్వే నిర్వహించే అవకాశం ఉంది.
రూ.11 వేలకు
చేరువలో వేరుశనగ
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో వేరుశనగ ధర రూ.11 వేలకు చేరువైంది. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం క్వింటా రూ.609 పెరిగింది. మార్కెట్‌కు 1,757 క్వింటాళ్ల వేరుశనగ విక్ర యానికి రాగా క్వింటా గరిష్టంగా రూ.10,889, కనిష్టంగా రూ.8203 ధరలు లభించాయి. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,771, కనిష్టంగా రూ.2,369, కందులు గరిష్టంగా రూ.7,639, కనిష్టంగా 6,125, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,979, కనిష్టంగా రూ.1,931, పత్తి గరిష్టంగా రూ.7,629, కనిష్టంగా రూ.6,869, ఉలువలు రూ.4,569, మినుములు రూ.6,899 పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా రూ.7,020, కనిష్టంగా రూ.7,002గా ధరలు లభించాయి.
మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిల నియామకం
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం నియమించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, భూత్పూర్ మున్సిపాలిటీకి ఏఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, దేవరకద్రకు మాజీ చైర్మన్ పల్లె రవి, కొత్తకోటకు పార్టీ సీనియర్ నేత పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డిలను నియమించారు. అలాగే జోగుళాంబ జిల్లా పరిధిలోని గద్వాల మున్సిపాలిటీ ఇన్‌చార్జిగా శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నియామకం అయ్యారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కల్వకుర్తి మున్సిపాలిటీకి రాజీవ్‌సాగర్, కొల్లాపూర్ మున్సిపాలిటీకి ఉప్పల వెంకటేష్‌గుప్తాలను నియమించారు.
కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి


