క్యూలైన్‌లో బారులు.. ట్రాఫిక్‌పై ఆంక్షలు
నిజరూప దర్శనం.. కలశాలతో అభిషేకం
వసంత పంచమి వేళ భక్తులకు జోగుళాంబ మాత నిజరూప దర్శనాన్ని వీక్షించే భాగ్యం కలిగింది. నిజరూప దర్శనమిచ్చిన జోగుళాంబ మాతకు సహస్ర ఘట్టాలతో విశేషాభిషేకాలు జరిగాయి. పంచామృతాలతోపాటు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పండ్లరసాలు, కుంకుమ, పసుపు, భస్మం, గంధం, పన్నీరు, సుగంధద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. జోగుళాంబ మాతను భక్తులు వివిధ అలంకరణలో వీక్షించే అవకాశం నిరంతరం కలుగుతుంది. కానీ వార్షిక ఉత్సవాల్లో వసంత పంచమిరోజు భక్తులకు నిజరూప దర్శన ప్రాప్తి కలిగింది. అశేష భక్తజనం అమ్మవారి అభిషేకాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం జోగుళాంబ మాతకు పట్టువస్త్రాలతో అలంకరించి రకరకాల పూలమాలలు, నిమ్మకాయాల హారాలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. అమ్మవారికి దశవిదహారతులు సమర్పించారు.
జోగుళాంబ అమ్మవారి అభిషేకానికి, దర్శనాలకు భక్తులు బారులుదీరారు. ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులరాక ఆరంభమైంది. సమయం గడిచే కొద్దీ సుదూర ప్రాంతాల భక్తులు, ఆయా గ్రామాలు, మున్సిపాలిటీలోని వివిధ కాలనీల నుంచి భక్తులు కలశాలను శిరస్సున ధరంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల తాకిడి అంతకంత పెరిగింది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక క్యూలైన్‌ల ద్వారా దర్శించుకున్నారు. సాధారణ భక్తులు, కలశాలతో వచ్చే భక్తులు, వీఐపీలకు ప్రత్యేకంగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ప్రముఖుల తాకిడి పెరగడంతో సాధారణ క్యూలైన్, కలశాలతో వచ్చే భక్తులు అభిషేకానికి, దర్శనాలకు నిరీక్షించాల్సి వచ్చింది. ఆలయ ఈఓ దీప్తి, సీఐలు రవిబాబు, టాటాబాబు ఆధ్వర్యంలో పోలీసులు క్యూలైన్‌లో భక్తులు ఎక్కువసేపు నిరీక్షించకుండా చర్యలు చేపట్టారు. వాహనాల సంఖ్య పెరగడంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా పట్టణ ముఖద్వారం వద్ద కోర్టు పక్కన వాహనాలను నిలిపివేఽశారు. ప్రముఖల వాహనాలు ఎక్కువ కావడంతో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.


