పోలింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విధులు కేటాయించిన పోలింగ్ సిబ్బందికి సకాలంలో నియామక ఉత్తర్వులు అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయనీదేవితో కలిసి రెండోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని పేర్కొన్నారు. రెండోదశ ఎన్నికలు జరిగే మండలాల్లో 20 శాతం రిజర్వ్ సిబ్బందితో కలిపి 1,601 పీఓలకు, 1902 ఓపీఓలు మొత్తం 3503 మందికి రాష్ట్ర ఎన్నికల సంఘం టీపోల్ పోర్టల్ సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆఱర్‌డీఓ నవీన్, తదితరులుపాల్గొన్నారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లా అంతటా గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ విజయేందిర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా సంబంధిత గ్రామాలు, మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని, మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోతుందని తెలిపారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలలో సైతం ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


