గిరిజన గురుకులంలో విద్యార్థినులతో వెట్టిచాకిరి
జడ్చర్ల: మండలంలోని రిజన గురుకులం విద్యాలయంలో విద్యార్థినులతో వెట్టి చాకిరి చేయించిన ఘటనలు శనివారం వెలుగులోకి వచ్చాయి. గురుకుల విద్యాలయంలో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటనలో వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడం, తదుపరి ఆమెతో పాటు ప్రిన్సిపాల్ రజనీపై కూడా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో చేయించిన వెట్టి పనులకు సంబంధించిన ఫొటోలను తల్లిదండ్రులు బహిర్గతం చేశారు. సొంత కార్లను నీటితో కడిగించుకోవడం, తరగతి గదులను ఊడ్పించడం, వంటపాత్రలను శుభ్రం చేయించడం తదితర పనులను విద్యార్థినుల చేతనే చేయించే ఫొటోలున్నాయి. ఇన్నాళ్లు ఈ కష్టాలను అనుభవిస్తున్నా.. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ భయంతో బయటకు వెళ్లగక్కే పరిస్థితి లేకపోయినట్లు తెలిసింది. సంబంధిత ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు కూడా విద్యార్థినులు వారికి విషయం చెప్పడానికి భయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి గురుకులాల్లో చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.


