
బంద్ సంపూర్ణం
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్
నిర్మానుష్యంగా మారిన జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్
స్టేషన్ మహబూబ్‌నగర్/ జెడ్పీసెంటర్/ మహబూబ్‌నగర్ క్రైం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు ఉదయం నుంచే దుకాణాలను బంద్ చేయగా.. ఆర్టీసీ బస్సులు డిపోలు, బస్టాండ్లలోనే నిలిచిపోయాయి. ఉదయం నుంచే ప్రధాన పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని బస్టాండ్ గేటు ఎదుట బైఠాయించి.. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మహబూబ్‌నగర్ డిపోకు చెందిన 137 బస్సులు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్సుల బంద్‌తో డిపోకు సంబంధించిన రోజువారీ ఆదాయంపై ప్రభావం ఏర్పడింది. ముందస్తుగా తెలంగాణ బంద్ సమాచారం ఉండడంతో బస్టాండ్‌లో ప్రయాణికులు చాలా తక్కువ సంఖ్యలో కనిపించారు.
ముందుగా ఆర్టీసీ బస్టాండ్ గేటు ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు శివరాజు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి బస్టాండ్ గేటు ఎదుట నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, అంజయ్య, రమేష్‌కుమార్, పాండురంగారెడ్డి, సతీష్‌కుమార్, కృష్ణవేణి, యాదమ్మ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఆర్‌అండ్‌బీ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల మీదుగా మోటార్‌బైక్ ర్యాలీలు చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సమూహంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాష్ట్ర ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధతతోపాటు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, మైత్రియాదయ్య, బీసీ జేఏసీ నాయకులు బెక్కం జనార్దన్, శ్రీనివాస్‌సాగర్, సారంగి లక్ష్మీకాంత్, మున్నూరు రాజు తదితరులు గేటు ఎదుట నిరసన చేపట్టారు.
ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోలతో ర్యాలీ తీశారు. అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సంప్రదాయమైన డోలుతో బస్టాండ్ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. మోటార్‌బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్, టీఎఫ్‌టీయూ, సబ్బండ ప్రజా సంఘాలు పట్టణ పురవీధుల్లో ప్రదర్శనలు, తెలంగాణ చౌరస్తా, క్లాక్‌టవర్, అంబేద్కర్ చౌరస్తాలో సభలు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆయా ప్రతినిధులు రామచందర్, ఎస్‌ఎం ఖలీల్, హనీఫ్ అహ్మద్, రాఘవాచారి, కిల్లె గోపాల్, కురుమూర్తి, తిరుమలయ్య, చంద్రకాంత్, రాజ్‌కుమార్, పాష, విజయ్‌కుమార్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
డిపోలు, బస్టాండ్లకే
పరిమితమైన ఆర్టీసీ బస్సులు
స్వచ్ఛందంగా దుకాణాలు
తెరవని వ్యాపారులు
బస్టాండ్ గేటు ఎదుట పార్టీలు, బీసీ సంఘాల నేతల బైఠాయింపు
జిల్లాకేంద్రంలో బైక్, ఆటోల
ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు

బంద్ సంపూర్ణం