
రిజర్వేషన్లు ఇచ్చేవాళ్లు రోడ్లపైకి రావడం విడ్డూరం
జెడ్పీసెంటర్: రిజర్వేషన్ ఇచ్చేవాళ్లు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బంద్‌లో భాగంగా తెల్లవారు జామున 5 గంటలకే బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ బంద్‌లో పాల్గొని ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ ఇవ్వగలిగే బీజేపీ కూడా ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి పదేళ్లలో బీఆర్‌ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, పేదలకు రుణాలు, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాలు ఏర్పాటు చేసిందని వివరించారు.