
భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది పోలీస్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు. పాలమూరు యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరైన సందర్భంగా పోలీసులు పహారా కాశారు. బందోబస్తును జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు డీఐజీ బందోబస్తు పర్యవేక్షిస్తూ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో సర్వైలైన్స్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.
నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తే చర్యలు
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో ఏదైనా ప్రాంతాల్లో కానీ, ఇళ్లు, ఫ్యాక్టరీలలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ వంటి డ్రగ్స్ తయారీ కార్యకలాపాలు ఉంటే టోల్ ఫ్రీ నం.18005996969తోపాటు ఆయా జిల్లాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ ఏరియాల్లో అనుమానాస్పదంగా కనిపించినా, ఎవరైనా వ్యక్తులు డ్రగ్ విక్రయాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను గుర్తిస్తే నకిలీ, నాణ్యత లేని మందులను మార్కెట్‌లోకి రాకుండా నివారించవచ్చని చెప్పారు.
ఖాళీ సీట్ల భర్తీకిదరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని బాలానగర్, దేవరకద్ర, రాంరెడ్డి గూడెం, జడ్చర్ల, నంచర్ల గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోఆర్డినేటర్ వాణిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 18 లోగా ఆయా గురుకులల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
నేడు వాలీబాల్ జట్టు
ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఒరిజినల్ మెమో, బోనోఫైడ్‌తో ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరుకావాలని ఆమె కోరారు.
19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
యోగాసన క్రీడాజట్ల ఎంపికలు
ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్‌రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్‌కు సంప్రదించాలని వారు సూచించారు.