
విలువలు పెంపొందించుకోవాలి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్‌బేరర్‌గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని.. అది విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే సందర్భం అన్నారు. విద్య యొక్క అసలు లక్ష్యం ఉద్యోగం పొందడమే కాదని.. అది వ్యక్తిత్వం, విలువలు, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అన్నారు. పీయూలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇక్కడ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మిలియన్ ట్రీ ప్లాంటేషన్, యూనివర్సిటీ విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకోవడం, కనెక్ట్ విత్ చాన్స్‌లర్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏ యూనివర్సిటీ సాధించలేని విధంగా పీయూ పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు సాధించడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. యూనివర్సిటీ ఈ సంవత్సరం న్యాక్ రెండోసారి వెళ్లడం మంచి పరిణామం అని, ఉన్నత విద్యకు కృషి చేసే యూనివర్సిటీలు ఆధునిక దేవాలయాలుగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి యూనివర్సిటీలు రీసెర్చి, ఇంక్యూబేషన్ సెంటర్‌లుగా మారి విద్యార్థుల ద్వారా కొత్త స్టార్టప్‌లు ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
పీయూలో ఇటీవల లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని గవర్నర్ అన్నారు. ఇంజినీరింగ్‌లో డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషన్ లర్నింగ్ వంటి ఆధునిక కోర్సులు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 100 శాతం అడ్మిషన్లు సాధించడం అభినందిచదగ్గ విషయమన్నారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సబ్జెక్టులతో ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020తో విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు అభినందించారు.