
నగరంలో తాగునీటికి కటకట!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటమే. దీంతో రాంరెడ్డిగూడెం ఫిల్టర్‌బెడ్ పరిధిలోకి వచ్చే నగరంలోని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, బీఎన్‌రెడ్డికాలనీ, బాలాజీనగర్, క్రిస్టియన్‌పల్లి, అయోధ్యనగర్, పాతపాలమూరు, బండమీదిపల్లి, హనుమాన్‌పురా, గణేష్‌నగర్, వల్లభ్‌నగర్, కిసాన్‌నగర్, బండ్లగేరి, వీరన్నపేట, టీడీగుట్ట, కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్, చిన్నదర్‌పల్లి, కొత్తచెరువురోడ్, కొత్తగంజి, హనుమాన్‌నగర్, సింహగిరి, మోతీనగర్, రైల్వేస్టేషన్ ఏరియా, సుభాష్‌నగర్, కోర్టురోడ్, బోయపల్లి తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది..
● నగరంలోని 60 డివిజన్ల పరిధిలో మూడు లక్షల పైచిలుకు మంది ప్రజలు నివసిస్తున్నారు. 2020 నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా మొత్తం 28 ఓవర్‌హెడ్ ట్యాంకులను నింపుతున్నారు. ఇంటింటికీ తాగునీటిని రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అయితే సుమారు 20 ఏళ్ల క్రితం పాత పైపులైన్లకు మిషన్ భగీరథ లైన్లు కలపడంతో తరచూ అవి ఎక్కడబడితే అక్కడి పగిలిపోతున్నాయి. అలాగే మెయిన్ పైపులైన్‌కు సైతం లీకేజీలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఎన్‌హెచ్–167పై స్థానిక షాషాబ్‌గుట్ట మలుపు వద్ద, రాంరెడ్డిగూడెం, ధర్మాపూర్ శివారులో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రాంరెడ్డిగూడెం ఫిల్టర్‌బెడ్ పరిధిలోని ఆయా ప్రాంతాలకు తాగునీరు నిలిచిపోయింది. వీటిని బాగుచేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వారం రోజులు పట్టడంతో అందరూ అల్లాడిపోయారు. మూడు రోజుల నుంచే ట్యాంకర్లను పంపించగలిగారు. చివరకు గురువారం తెల్లవారుజామున పునరుద్ధరించి ఆయా ఓవర్‌హెడ్ ట్యాంకులను నింపారు. ఉదయం నుంచి భగీరథకాలనీ, బాలాజీనగర్ తదితర ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఆరంభం కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. వీలైనంత త్వరగా విడతల వారీగా మిగతా ప్రాంతాలకు నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
రాంరెడ్డిగూడెం, ధర్మాపూర్ శివారులో పైపులైన్లకు లీకేజీ
మరమ్మతుల పేరిటమున్సిపల్ అధికారుల కాలయాపన
పది రోజులుగా 65 శాతం
ప్రాంతాలకు అందని వైనం
మూడు రోజుల నుంచి
ట్యాంకర్ల ద్వారా సరఫరా
ఎట్టకేలకు ఓవర్‌హెడ్ ట్యాంకులకు పంపింగ్ కావడంతో కొంత ఊరట