
బాలిక మృతదేహంతో ధర్నా
మల్దకల్: మహబూబ్‌నగర్ జిల్లా రాంరెడ్డిగూడెం గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ప్రి యాంక సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మంగళవారం మండల కేంద్రంలోని అయిజ–గద్వాల ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పేందుకు యత్నించినా ఒప్పుకోలేదు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, మృతికి కార కులైన వారిని కఠినంగా శిక్షించే వరకు విరమించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆందోళన తో వాహనాలు అక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తానని భరోసానివ్వడంతో ఆందోళన విరమించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐలు, పోలీసులు ఉన్నారు.