
ఆటలకు అందలం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్‌తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
వరంగా వసతులు..
హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్ తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్ లో హైజంప్, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో, పోల్‌వాల్ట్‌తో పాటు ఒక ఫుట్‌బా ల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలు గా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్‌తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్‌నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది.
పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు
సింథటిక్ నిర్మాణంతో అథ్లెటిక్స్‌కు అనేక అవకాశాలు
ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోట్
నిర్మాణంతో ప్రయోజనం
ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు
సౌత్‌జోన్‌లో 1,050,
ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు
జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం..
పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టెపుల్ చేజ్‌తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టెపుల్ చేజ్‌లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్‌లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్‌రే గత నాలుగేళ్లు ఎస్‌జీఎఫ్‌ఐ క్రికెట్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్‌జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఆటలకు అందలం