
తేలని ఇసుక పంచాయితీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా కోసం ‘మన ఇసుక వాహనం’ ద్వారా చేపట్టిన కార్యక్రమానికి అడ్డంకులు తొలగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మిళల్లో తుంగభద్ర నది నుంచి ఇసుకను సేకరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల తవ్వకాలను ప్రారంభించారు. అయితే అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోగా.. దుమారం చెలరేగింది. ఇసుక రవాణా కొనసాగాలంటే సంబంధిత కాంట్రాక్టర్ ఒక్కో టిప్పర్‌కు రూ.6 వేల చొప్పున కప్పం చెల్లించాలని హుకుం జారీ చేయగా.. కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇసుక రవాణా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అధికార పార్టీకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగినట్లు తెలిసింది.
ఎవరి పట్టు వారిదే..
తుమ్మిళ్ల నుంచి ఇసుక బయటకు రావాలంటే ఒక్కో ట్రిప్పర్‌కు రూ. 6వేల చొప్పున ఎట్టిపరిస్థితుల్లోనైనా చెల్లించాల్సిందేనని అధికార నేత పట్టుబట్టినట్టు సమాచారం. దీనిపై మంగళవారం సైతం అధికార నేతకు చెందిన సన్నిహితులు.. కాంట్రాక్టర్‌తో చర్చ లు జరిపినట్లు సమాచారం. బేరసారాలు జరిగినా సఫలం కానట్లు తెలిసింది. సదరు నేతకు కప్పం చెల్లించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదంటూ ఆయన భీష్మించుకొని కూర్చున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఇసుక రవాణాకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారుల మౌనంపై విమర్శలు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం తుంగభద్ర నుంచి ఇసుక తవ్వకాలను ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వీడకపోవడం.. సకాలంలో ఇసుక అందేలా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ తో ‘అధికార’సన్నిహితుల బేరసారాలు
కప్పం కట్టేందుకు
అంగీకరించని కాంట్రాక్టర్
మౌనం వీడని అధికారులు
ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్లలబ్ధిదారుల్లో అసహనం