
పరిశోధనలకు పట్టం
పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్
– మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్
పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్‌కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్‌మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్‌కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్‌ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.
స్నాతకోత్సవంలో
12 మందికి డాక్టరేట్లు
పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి
మన్నె సత్యనారాయణరెడ్డికి
గౌరవ డాక్టరేట్ ప్రదానం
గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు

పరిశోధనలకు పట్టం