
అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
మహబూబ్‌నగర్ క్రైం: కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్న డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలో రాత్రివేళ దొంగతనాలు జరుగుతున్న క్రమంలో ఎస్పీ శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు, అనుమానస్పద వ్యక్తులను, పిస్తాహౌజ్ చౌరస్తా, న్యూటౌన్, బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయడంతోపాటు ఆ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటమే పోలీసుల లక్ష్యం అని, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ పెంచుతున్నట్లు చెప్పారు. తనిఖీల్లో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
లైసెన్స్ తప్పక తీసుకోవాలి
దీపావళి పండగ నేపథ్యంలో ప్రత్యేకంగా హోల్‌సేల్‌తోపాటు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి బాణాసంచా విక్రయాలు జరిపే వ్యాపారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని, లైసెన్స్ తీసుకోవాలని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టపాసుల దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, పెట్రోల్ బంకుల సమీపంలో కాకుండా.. జిల్లా అగ్నిమాపక అధికారులు సూచించిన ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నవాబుపేట మండలంలోని ఎన్మన్‌గండ్ల హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి ఇందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్మన్‌గండ్లలోని బాలికల హాస్టల్‌ను శనివారం కలెక్టర్ విజయేందిర తనిఖీ చేసిన సందర్భంలో విద్యార్థులకు భోజనంలో కూరగాయలు వడ్డించకుండా కేవలం సాంబార్ మాత్రమే వడ్డించడం, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హాస్టల్ వార్డెన్‌పై సస్పెషన్ వేటు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే ఆదివారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ ఎస్టీ హాస్టల్, వెంకటేశ్వరకాలనీలోని ఎస్సీ హాస్టల్‌ను అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డించే చట్నీలో నాణ్యత లేకపోవడంతో సంబంధిత హాస్టల్ వార్డెన్‌కు మెమోలు జారీ చేశారు.

అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు