
లింక్‌ను క్లిక్ చేస్తే.. ఖాతాలో డబ్బులు మాయం
అచ్చంపేట రూరల్: టెలిగ్రామ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగా ఖాతాలోని డబ్బులు మాయమైన సంఘటన అచ్చంపేట పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన నరేష్ ఈనెల 16న టెలిగ్రామ్‌లో ఓ లింక్ వచ్చింది. రూ.30వేలు పెట్టుబడి పెడితే రూ.50వేలు వస్తాయని లింక్‌లో సమాచారం ఉండటంతో లింక్ నొక్కాడు. తర్వాత మరో రూ.6వేలు పంపాలని సందేశం రావడంతో అనుమానం వచ్చి ఖాతాలోని డబ్బులు చూస్తే రూ.30వేలు మాయమైనట్లు గ్రహించాడు. గురువారం బాధితుడి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌భాస్కర్ తెలిపారు.
2 ఇసుక లారీలు పట్టివేత
అలంపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను గురువారం పట్టుకున్నట్లు ఉండవెల్లి ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. బ్లూకోల్ట్ సిబ్బంది అనిల్‌కుమార్, రవి తెల్లవారుజామున 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై విధులు నిర్వర్తిస్తుండగా.. కర్నూలు వైపు నుంచి వచ్చిన ఇసుక లా రీని తనిఖీ చేయగా ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన లారీ డ్రైవర్ రాముడు, తాడిపత్రికి చెందిన యజమాని మల్లికార్జున్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా అదే మార్గంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వచ్చిన మరో లారీని పట్టుకొని అనంతపూర్‌లోని పుట్లూర్‌కు చెందిన లారీ డ్రైవర్ విశ్వనాథ్, యజమాని రామ్మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ట్రాక్టర్‌పై నుంచి
పడి డ్రైవర్ మృతి
వనపర్తి రూరల్: ఇసుక ట్రా క్టర్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ యుగేందర్‌రెడ్డి వివరాల మేరకు.. పెబ్బేరు మండలం వై.శాఖాపూర్ గ్రామానికి చెందిన పగిడాల భరత్ కుమార్ (29) బుధవారం రాత్రి గ్రామ సమీపంలోని ఊకచెట్టు వాగు నుంచి ఇసుక నింపుకొని బయల్దేరాడు. మార్గమధ్యంలోని పెద్దగుట్ట వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఓ బండరాయిని ఎక్కడంతో డ్రైవింగ్ సీటులో నుంచి అతడు ఎగిరిపడి టైరు కింద పడ్డాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించి.. రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.