
జడ్చర్లకు ఏటీసీ సెంటర్ మంజూరు
జడ్చర్ల నియోజకవర్గంలో రూ.45.15 కోట్లతో అ డ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటు కానుంది. ఈమేరకు రాజాపూర్ మండలం ఈద్గాన్‌పల్లి వద్ద సెంటర్‌కు అనువైన స్థలాన్ని గుర్తించారు. మండలంలోని పోలేపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్‌పార్క్, ఫార్మాసెజ్ ఉండటంతో ఏటీసీ సెంటర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతిక విద్యలో సెంటర్ ప్రముఖంగా నిలవనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పలుచోట్ల ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయదలిచింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఇంజినీరింగ్, ఇతర విద్యార్థులను తయారు చేసే లక్ష్యంతో ఏటీసీ సెంటర్లను మంజూరు చేసింది. ఈక్రమంలో జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లిలో ఫార్మాసెజ్ ఉండటంతో అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాజాపూర్ మండలంలోని ఈద్గాన్‌పల్లి వద్ద ఏటీసీని ఏర్పాటు చేయదలచారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే కేంద్రంలో ఆధునిక సాంకేతిక విద్య ప్రముఖంగా నిలవనుంది.
వచ్చే ఏడాది అందుబాటులోకి..
ఏటీసి సెంటర్ ద్వారా ఆధునిక ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి. వాటితోపాటు గ్రంథాలయం, హాస్టల్, సాంస్కృతిక క్రీడా క్లబ్, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అందేలా వసతులు కల్పించబడతాయి. రూ.45.15 కోట్లతో ఏర్పాటు కానున్న ఏటీసీ కేంద్రం వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఆరు కోర్సులు.. 244 మందికి ప్రవేశాలు
ఏటీసీలో పదో తరగతి పూర్తి చేసిన వారికి ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో ఉండే ఆరు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కోర్సులో 20 మంది నుంచి 44మంది వరకు ప్రవేశాలు కల్పిస్తారు. అలా ఏడాదిలో 244 మందికి అవకాశం లభిస్తుంది. కోర్సుల్లో ప్రధానంగా ఫార్మా సెజ్‌కు అవసరమయ్యే వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తద్వారా ఇన్నాళ్లు ఫార్మా కంపెనీల్లో కిందిస్థాయి ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు వరిస్తున్నాయనే విమర్శలకు చెక్‌పెట్టవచ్చు. ఏటీసీ కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్‌లతో భాగస్వామ్యం ద్వారా ఇంటర్నిషిప్‌ద్వారా ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందిస్తారు. అంతేకాక విద్య, ఉద్యోగ, పరిశోధనల్లోనూ మార్పు రానుంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో సెట్విన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కావడంతో నిరుద్యోగులకు ఆయా రంగాల్లో తగిన శిక్షణ లభించే ఆస్కారం ఉంది. ఇంటర్ వరకు చదివిన వారికి ‘సెట్విన్’ వరం కానుండగా ఆపై ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఏటీసి సెంటర్ కీలకం కానుంది. ఏటీసి సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
యువతలో సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచి.. ఆధునిక పరిశ్రమలు, ఫార్మా రంగాల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి.. తక్షణ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. తాజాగా జడ్చర్ల నియోజకవర్గానికి సైతం ఒక ఏటీసీ సెంటర్ మంజూరైంది. రూ.45.15 కోట్లతో రాజాపూర్ మండలం ఈద్గాన్‌పల్లిలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీల్లో కిందిస్థాయి ఉద్యోగాలు మాత్రమే జిల్లాలోని వారికి అందుతున్నాయనే అపవాదు ఉండగా.. ఇక ఈ ఏటీసీ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ప్రముఖ కంపెనీలు, స్టార్టప్‌లలో పైస్థాయి ఉద్యోగ అవకాశాలు మెండుగా రానున్నాయి.
– జడ్చర్ల టౌన్
రాజాపూర్ మండలం ఈద్గాన్‌పల్లిలో ఏర్పాటుకు సన్నాహాలు
రూ.45.15 కోట్లతో మిషనరీ, మౌలిక వసతుల కల్పన
హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నిర్వహణ
పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యం