
ఎస్‌జీఎఫ్ క్రీడల సందడి
● మండల స్థాయిలో కొనసాగుతున్న పోటీలు
● త్వరలో జిల్లా స్థాయి, ఆపై
ఉమ్మడి జిల్లా ఎంపికలు
● జిల్లా నుంచి అండర్–14, అండర్–17 విభాగాల్లో క్రీడా టోర్నీలకు ప్రతిపాదనలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడల సందడి నెలకొంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తారు. పాఠశాల, కళాశాలల్లో అండర్–14, అండర్–17 బాల, బాలికలకు వేర్వేరుగా మండల స్థాయి మొదలు కొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల నైపుణ్యానికి వేదిక
పాఠశాల స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. గతంలో జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారులు స్కూల్ గేమ్స్ ద్వారానే ప్రతిభ చాటి వెలుగులోకి వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆరేళ్ల నుంచి వరుసగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా టోర్నీలను విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.
జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి..
ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తు న్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపారు. రాష్ట్రస్థాయి అండర్–17 విభాగం బాల, బాలికలకు వాలీబాల్, అండర్–14 విభాగం బాల, బాలికల ఖోఖో, అండర్–17 బాల, బాలికల ఫుట్‌బాల్, అండర్–17 బాలు ర విభాగం క్రికెట్ టోర్నీల కోసం ప్రతిపాదనలు చేశారు.
మండల స్థాయిలో ఎస్‌జీఎఫ్ క్రీడలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు సంబంధించి మండల స్థాయి లో క్రీడలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టోర్నీ కమ్ ఎంపికలు జరుగుతున్నా యి. ఇక్కడ ప్రతిభ కనబరిచే క్రీడాకారులు జిల్లాస్థాయి టోర్నీ కమ్ సెలక్షన్స్‌లో పాల్గొంటారు. మండలస్థాయిలో క్రీడా పోటీలు పూర్తయిన అనంతరం త్వరలో జిల్లాస్థాయిలో, ఆపై ఉమ్మడి జిల్లాస్థాయిలో జరగనున్నాయి.
జిల్లాలో జాతీయస్థాయిలో క్రికెట్ టోర్నీలు
జిల్లాలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ క్రికెట్ అండర్–17 బాలుర, బాలికల చాంపియన్‌షిప్‌లు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో 2025–26 జాతీయస్థాయి టోర్నీలకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేయగా.. మహబూబ్‌నగర్‌కు అండర్–17 విభాగం బాల, బాలికల క్రికెట్ టోర్నీలు కేటాయించారు. అండర్–17 విభాగం బాలుర క్రికెట్ టోర్నమెంట్‌ను అక్టోబర్‌లో, బాలికల క్రికెట్ పోటీలు జనవరిలో నిర్వహించడానికి జిల్లా ఎస్‌జీఎఫ్ వారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.