
చిరుత సంచారంతో బెంబేలు
మల్దకల్: మండలంలోని మద్దెలబండ గ్రామ సమీపంలోని గుట్టల్లో చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గుట్టల సమీపంలో గ్రామస్తుడైన నర్సింహులుకు వ్యవసాయ పొలం ఉండగా.. అక్కడే గుడిసె ఏర్పాటు చేసుకున్నాడు. అయితే, శనివారం గుడిసె వద్ద కాపలాగా ఉన్న కుక్కలపై చిరుత దాడి చేసింది చంపింది. విషయం తెలుసుకున్న ఫారెస్టు రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్ సంఘటన స్థలానికి చేరుకొని చిరుత జాడలని నిర్ధారణ చేయడంతో రైతుల్లో భయాందోళన మరింత ఎక్కువైంది. గుట్ట శివారులోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న పశువులను రైతులు గ్రామంలోకి తీసుకొచ్చారు. అలాగే రైతులు, కూలీలు పొలాలకు, పనులు చేసేందుకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చి చిరుత తమపై దాడి చేస్తుందోననే భయాందోళనతో గ్రామస్తులు, గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. చేతికొచ్చిన పత్తిపంటను తీయడానికి కూలీలు ముందుకు రావడం లేదు. ఇటు చిరుత భయం, అటు కూలీల భయాందోళనతో చేతికొచ్చిన పంటలను ఇంటికి తెచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఫారెస్టు అధికారులు చిరుతను బంధించి తమకు రక్షణ కల్పించాలని చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
వ్యవసాయ పొలాలకు
వెళ్లేందుకు జంకుతున్న రైతులు