
శ్రీశైలంలో అయిదు గేట్లు ఎత్తివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తిన ఏడు గేట్లలో ఆదివారం రెండు గేట్లను మూసి వేసి అయిదు గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో స్పిల్‌వే ద్వారా 41,742, విద్యుదుత్పత్తి చేస్తూ 40,476, సుంకేసుల నుంచి 40 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 6,690 క్యూసెక్కులు కలిపి మొత్తం 1.29 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టు అయిదు గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,37,390 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు భూగర్భ కేంద్రంలో 16.75 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.25 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 30,615 మొత్తం 65,876 క్యూసెక్కుల నీళ్లను అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.7 అడుగుల నీటిమట్టం వద్ద 208.2841 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 12,667 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,429 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్థానికంగా 36.60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.