
‘కాళేశ్వరం’ అవినీతిని నిగ్గు తేల్చేందుకే సీబీఐ విచారణ
స్టేషన్ మహబూబ్‌నగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ కోరినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంతి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందమని, చేతగాకనే కాళేశ్వరంను సీబీఐ విచారణకు ఇచ్చారని ఎంపీ డీకే అరుణ అనడం అర్థరహితమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్‌తో సమగ్ర విచారణ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, విజిలెన్స్ కమిషన్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అందరి సమ్మతితో సీబీఐకు అప్పగించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీల బంధం ఎలాంటిదో పార్లమెంట్ ఎన్నికల్లో చూశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరుశాతం కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటివేళ్లతో బయటకు తీస్తుందన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ము పంపకాల్లో తేడాలు రావడంతోనే గొడవలు జరగుతున్నాయని అన్నారు. సీఎం పేరును వారి కుటుంబ గొడవల్లోకి లాగుతున్నారని, సీఎంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ డిమాండ్ చేసినట్టే కాళేశ్వరంపై విచారణ సీబీఐకి అప్పగించామని, విచారణ పూర్తి చేసి బీజేపీ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన విచారణ చేసి దోషులను సత్వరమే శిక్షించేందుకే సీబీఐకి కేసును అప్పగించారని అన్నారు. తప్పు చేసిన దోషులను శిక్షించాలంటే జరిగిన అవినీతిపైన సమగ్ర విచారణ వేగవంతం చేయాలని సీఎం ఆలోచన చేశారని అన్నారు. ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికలో అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించి విషయం ఉందని, తుమ్మిడిగడ్డ ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం, సీడబ్ల్యూసీ ఇచ్చిన లేఖల ఆధారం, నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టులు, అన్ని రిపోర్టుల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్టు ఇచ్చిందన్నారు. సీబీఐ పరిధిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ఏజన్సీలు ఫండింగ్ చేశాయని అన్నారు. సత్వర విచారణకు సీబీఐ కరెక్ట్ అని, టెక్నికల్ అంశాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, నాయకులు వినోద్‌కుమార్, ఎన్‌పీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.