
పాడైన రోడ్ల మరమ్మతు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వర్షాలకు పాడైన రోడ్లు, ప్రభుత్వ భవనాలను గుర్తించి మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతేడాది విపత్తు నిర్వహణ కింద వరదలు, వర్షాలు దెబ్బతిన్న భవనాలు, రోడ్లకు మరమ్మతుల మంజూరు, వ్యయం వివరాలు, బ్యాలెన్స్ నిధులపై సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం 2025 వర్షాలకు గుంతలు పడిన రోడ్లను వెంటనే వాటిని గుర్తించి ప్యాచ్ వర్క్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, వార్డ్ ఆఫీసర్ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు మరమ్మతులు అవసరం ఉంటే అంచనాలు పంపించాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం మరమ్మతులు చేయాల్సిందిగా సూచించారు.
భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
భూ భారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. తిరస్కరించిన, పరిష్కరించిన, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను మండలాల వారీగా సంబంధిత తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఒక్క దరఖాస్తును కూడా పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మూసాపేట మండలంలో నిర్మాణం పూర్తి చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నరసింహారెడ్డి, ఆర్‌డీఓ నవీన్, డీఆర్‌డీఓ నర్సింహులు, హౌసింగ్ పీడీ భాస్కర్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ కృష్ణ, మహిళ శిశు సంక్షేమ అధికారిని జరీనా బేగం, జిల్లా వెటర్నరీ అధికారి మధుసూదన్ గౌడ్, డీపీఓ పార్థసారథి, డీఏఓ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ‘ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వండి’ అనే స్టిక్కలు అతికించారు. కలెక్టరేట్‌లో ఉన్న ప్రతి శాఖ కార్యాలయం ప్రధాన డోర్‌కు ఈ స్టిక్కర్లు అతికించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మిమ్మల్ని ఎవరైనా లంచం ఇవ్వమని వేధిస్తున్నారా..? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి అని ఉన్న స్టిక్కర్లను అతికించారు. ఏదిఏమైనా ఈ స్టిక్కర్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత భయాన్ని రేపుతున్నాయి.