
సమస్యలపరిష్కారానికి అంగీకారం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రీజియన్‌లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌ఎం సంతోష్‌కుమార్ అంగీకరించారని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, నాయకులు జె.ఎన్.రెడ్డి, భగవంతు తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ లో కోత విధించిన 30 శాతం ఆదాయపు పన్ను తిరిగి చెల్లించేందుకు ఒప్పుకొన్నారన్నారు. ఎలక్ట్రికల్ డీలక్స్ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగుల భార్యాభర్తల ప్రయాణ ం, ఆర్టీసీ క్లినిక్‌లో ల్యాబ్ టెక్నీషియన్ నియామకానికి, మందుల సరఫరాకు అంగీకరించారన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయులు, అంజన్న, మనోహర్, రియాజొద్దీన్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు
చిన్నచింతకుంట: అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో స్వామి హుండీని గురువారం లెక్కించారు. రూ.7,03,116 ఆదాయం వచ్చిందని, ఇది గత నెల అమావాస్య, శని, సోమవారాలను పురస్కరించుకొని భక్తులు స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది తిరుపతయ్య, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, కమలాకర్, నాగరాజు, అర్చకులు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
7న ఆలయం మూసివేత
ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కురుమూర్తిస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేయనున్నారు. తిరిగి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగాసన పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. నిర్మల్‌లో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌కు వెళుతున్న జిల్లా క్రీడాకారులను గురువారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌పీ.వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.సాయికుమార్, కోశాధికారి యూ.సురేష్, నారాయణపేట జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపరిష్కారానికి అంగీకారం