
రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని బోయపల్లిరోడ్‌లో గల హకా రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా పంపిణీ ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేకుండా చూసుకోవాలని, రైతులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఒకరోజు ముందుగానే టోకన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ టోకెన్లు వచ్చేలా చూడాలని, మహిళలకు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారికి చైర్మన్ ఫోన్ చేసి యూరియా పంపిణీ, భూ భారతి చట్టం అమలు తీరుపై ఆరా తీశారు. రైతులకు ఒకే కేంద్రానికి కేంద్రానికి రాకుండా ఎక్కడి వారికి అక్కడే పంపిణీ జరిగేలా చూడాలని కలెక్టర్, డీఏఓలకు సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్న విషయాల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి