
దొంగలు దండి
రైలుబండి..
● రైళ్లలో ఏటా పెరుగుతున్న దొంగతనాలు
● విలువైన వస్తువులు,
బంగారం, నగదు మాయం
● రెండేళ్లలో 57 కేసుల్లో రూ.27.89లక్షల సొమ్ము చోరీ
అప్రమత్తంగా ఉండాలి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణం చేసే రైళ్లలో ఆకసస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. ప్రయాణికులు ఎవరూ కూడా బంగారం, ఇతర విలువైన ఆభరణాలు శరీరంపై కన్పించేవిధంగా ఉండరాదు. అభరణాలను దుస్తులతో సక్రమంగా కవర్ చేసుకోవాలి. కన్పించేవిధంగా ఎంటే దొంగలకు లక్ష్యంగా మారుతారు. అందరూ నిద్రపోకుండా కుటుంబంలో ఒకరు లగేజ్‌ను పరిశీలిస్తూ ఉండాలి. అనుమానితులు కన్పిస్తే రైల్వేపోలీసులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
– రాజు, రైల్వే ఎస్‌ఐ
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైలుమార్గంలో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో రైలులో భారీ దొంగతనాల నుంచి చిన్నపాటి జేబు దొంగతనాల వరకు బాగా పెరిగాయి. చిన్నచిన్న చోరీలు లెక్కగట్టగపోయినా పెద్దగా నష్టపోయిన బాధితులు రైల్వే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రైలులో ప్రయాణం చేసే సందర్భంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న విలువైన వస్తువులు, బంగారం, నగదు అపహరిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగలతోపాటు తెలంగాణకు చెందిన ముఠాలు గ్రూప్‌లుగా ఏర్పడి కొన్ని ప్రత్యేక రైళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దూర ప్రయాణాలు చేసే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటివాటిలో ఘటనలు అధికమవుతున్నాయి. రైలులో ప్రయాణం చేసేవారి నుంచి ప్రధానంగా బంగారం, నగదు, సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు రైలులో ప్రయాణం చేసే క్రమంలో విలువైన బంగారం మెడలో వేసుకుని వెళ్లడం, నిద్రించే సమయంలో వాటిపై సరైన దృష్టి పెట్టకపోవడంతో నష్టం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 2024లో 31దొంగతనాల కేసులు నమోదైతే దీంట్లో రూ.16.17లక్షల విలువ చేసే సొమ్ము చోరీకి గురైంది. దీంట్లో ఇప్పటి వరకు కేవలం 18శాతం మాత్రమే రికవరీ చేయడం జరిగింది. ఇక 2025లో 26కేసులు నమోదైతే 11.72లక్షల సొమ్ము చోరీకి గురైతే 20శాతం రికవరీ చేయడం జరిగింది.

దొంగలు దండి