● ఆరోగ్యకర జీవనశైలితో జబ్బుకు దూరం
● వర్షాకాలంలో కొత్తనీరుతో ఆరోగ్య సమస్యలు
పాలమూరు: డయేరియా.. అతి విరేచనాలు.. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో ఇదీ ఒక్కటి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, పరాన్నజీవులు, పేగు రుగ్మతలతోపాటు కలుషిత ఆహారం, నీరు తీసుకోవడంతో ఇది కలుగుతుంది. సూక్ష్మజీవుల సంక్రమణ ఫలితంగా కడుపులోని పేగువాపు అయినా విరేచనాలు తరుచూ అవుతాయి. చాలా సందర్భాల్లో ఇంటి చికిత్సతో తగ్గినా.. కొన్నిసార్లు నిపుణుడైన వైద్యుడిని సంప్రదించి సరైన వైద్య చికిత్స తీసుకోకుంటే ప్రాణాలకు ముప్పు తప్పదు. అన్ని వయసుల వారిలో వచ్చే డయేరియా నివారణకు తొలి మందు ఆరోగ్యకర జీవనశైలేనని వైద్యులంటున్నారు.
● ఒక వ్యక్తి ఉదయం, సాయంత్రం తరచూ విరేచనాలకు వెళ్తుంటే డయేరియాగా గుర్తించవచ్చు. ఇలా నాలుగు వారాలు కొనసాగినప్పుడు అవి దీర్ఘకాలిక విరేచనాలుగా గుర్తించవచ్చని వైద్యులు అంటున్నారు. మనిషి జీవనశైలిలో మార్పుల కారణంగా కూడా డయేరియా రావచ్చని పేర్కొంటున్నారు. సిగరెట్లు ఎక్కువగా తాగడంతో అందులోని నికోటిన్ వదులు విరేచనాలు కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో, అర్ధరాత్రి అల్పాహారం తీసుకోవడం వల్ల కూడా ఒక్కోసారి వీరేచనాలు కలుగుతుంటాయి. ఎక్కువ కాఫీ తాగడం, అధిక ఆహారం తీసుకోవడం, యాంటీబయాటిక్స్ మందులను వాడేవారిలో ఉదయాన్నే విరేచనాలు అవుతుంటాయి. ఆహారంలో బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహారం తినడంతో కూడా ఇలా జరగవచ్చు. అలాగే ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల, మానసిక ఒత్తిళ్లు, డీహైడ్రేషన్‌తో కూడా అధిక వీరేచనాలు కలుగుతాయి.
● లక్షణాలు: కడుపుబ్బరం, తిమ్మిరి లక్షణాలు, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, నీళ్ల విరేచనాలు, మలంలో రక్తస్రావం, నిద్రలేమి, వాంతులు వచ్చినట్లు అనిపించడం.
● నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పర్చుకోవడం ద్వారానే విరేచనాల నివారణ సాధ్యమవుతుంది. మంచి ఆహారం తీసుకోవడం, అందుకు తగ్గ వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం, ఒత్తిడిని తగ్గించుకుని సానుకూల జీవనం గడపడం, ధూమపానం, మద్యపానం తగ్గించడం, మానసిక ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సహించడం కోసం యోగా, ధ్యానం చేయడం ద్వారా అతి వీరేచనాల నుంచి బయటపడవచ్చు. పండ్లు, గ్లూటెన్ కల్గిన పిండి పదార్థాలు, డ్రైఫుడ్ వంటి తీసుకోవాలి. తక్షణం ఓఆర్‌ఎస్ తాగితే శరీరానికి కావాల్సిన ఖనిజాలు, నీరు అందించి నీరసం తగ్గుతుంది. గ్లూకోజ్‌ను అందించడం ద్వారా ప్రాణహాని తగ్గుతుంది.
వైద్యుల సలహాలు పాటించాలి
వర్షాకాలంలో కొత్తనీరు రావడంతో అలాంటి నీటిని కాచి చల్లార్చకుండా నేరుగా తాగితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. డయేరియా సోకితే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకొని మందులు వాడాలి. ఇంటి పరిసరాలతోపాటు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, కాచి చల్లార్చిన నీరు తాగాలి. వర్షకాలంలో సీజనల్ వ్యాధులపై చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– కృష్ణ, డీఎంహెచ్‌ఓ