
మార్కులు కాదు.. మార్పు కావాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు కావాల్సింది మార్కులు కాదని, వారిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఐటీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిధిగా హజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు ఇంజినీరింగ్ విభాగంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలంటే స్కిల్స్ అవసరం అన్నారు. సర్టిఫికెట్ అనేది కేవలం ఒక అర్హతను మాత్రమే నిర్ణయిస్తుందని, స్కిల్స్ పూర్తి స్థాయిలో ఉద్యోగానికి సిద్ధం చేస్తాయన్నారు. క్యాంపస్‌లో ఉన్న అన్ని వసతులను విద్యార్థులను వినియోగించుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ.. విద్యార్థులను విద్య ఒక్కటే ఉన్నతంగా తీర్చుదిద్దుతుందని, అటువంటి విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితంలో కష్టాలు తప్పవన్నారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. బాసర ఐఐఐటీ యూనివర్సిటీ వీసీ గోవర్దన్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావాన్ని అలవర్చుకుంటే ఉన్నతంగా రాణించవచ్చని, బాసర ఐఐఐటీలో చదివిన విద్యార్థులు నేడు దేశ, విదేశాల్లో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.అనవసర విషయాల జొలికి వెళ్లకుండా చదువుపై దృష్టి సారించి ఉత్తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అద్యాపకులు మురళీదర్శన్, ప్రిన్సిపాల్ శ్రవణ్‌కుమార్, రవీందర్, శివశంకర్, లక్ష్మీనారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.